TG : నేడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ( Kishan Reddy ) నేడు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రజలు, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో తాను నేడు ఉదయం10 గంటలకు ఢిల్లీలోని శాస్త్రిభవన్‌లో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రెండోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.
ఛార్జ్ తీసుకోవడానికి ముందు తెలంగాణ భవన్ లో అమరవీరుల స్తూపం వద్ద కిషన్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలు గురువారం లేదా శుక్రవారం కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రులుగా పెమ్మసాని, శ్రీనివాసవర్మలకు అవకాశం దక్కిన సంగతి తెలిసిందే.
తనకు బొగ్గుగనుల శాఖ కేటాయించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. విద్యుత్ కోతల్లేని దేశాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారన్న కిషన్‌రెడ్డి, బొగ్గు, గనుల శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com