KTR : జీహెచ్ఎంసీ స్పందించకపోతే తామే శ్రమదానం చేస్తాం : కేటీఆర్

ప్రజలు తమ కాలనీల్లో సమస్యలున్నాయంటూ ఎన్ని ఫిర్యాదులు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( K. T. Rama Rao ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను పరిష్కరించే విషయంలో జీహెచ్ఎంసీ ఎందుకు విఫలమవుతుందని ప్రశ్నించారు. తమ కాలనీలో చెట్లు భారీగా పెరిగిపోవటం, చెత్త చెదారం కారణంగా పాముల బెడద ఉందంటూ జీహెచ్ఎంసీ మేయర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదంటూ ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ కాలనీలో 50 కుటుంబాలున్నాయని మాకు సరైన రోడ్లు, నీటి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి అయితే చాలు దొంగతనాలు జరుగుతున్నాయని కేటీఆర్ కు వివరించాడు. ఈ ట్వీట్ పై కేటీఆర్ స్పందించారు. ఆ నెటిజన్ ఫిర్యాదు పై స్పందించి సమస్య పరిష్కరించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ని కోరారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏ సమస్య ఉన్న సరే ఒక్క ట్వీట్ చేస్తే ఆ సమస్యను పరిష్కరించేవాళ్లమని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై మాత్రమే ఈ ప్రభుత్వం దృష్టి పెట్టటంతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇకనైనా ప్రజ సమస్యలపై మేయర్ సహా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. లేదంటే 48 గంటల్లో సమస్య పరిష్కారం కాకపోతే స్థానికులతో కలిసి తామే శ్రమ దానం చేసుకోని సమస్య పరిష్కరించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com