CM Revanth Reddy : భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలి : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలి :  సీఎం రేవంత్ రెడ్డి
X

జాతీయ రహదారులకు భూ సేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత రైతులకు దక్కేలా చూడాలన్నారు. తెలంగాణలో భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) పరిధిలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

భూములకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు. స్పందించిన ముఖ్యమంత్రి తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని గుర్తించాలన్నారు. కలెక్టర్లు రైతులతో పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం, ఉత్తర భాగం వేర్వురుగా చూడొద్దని, ఆ రెండింటికి కలిపి ఒకే నెంబర్ కేటాయించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరగా, ఆయన సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఆ ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్ హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం (ట్రైపార్టియేట్ అగ్రిమెంట్) కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. వెంటనే దానిని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో భూ సేకరణలో ఉన్న ఆటంకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అలైన్ మెంట్ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దాంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. స్టే తొలగింపున‌కు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని కలెక్టర్ కు ముఖ్యమంత్రి సూచించారు.

Tags

Next Story