TS : తెలంగాణలో భూముల ధరల సవరణ.. రేవంత్ సంచలనం
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల ఆధికారుల సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి నెలా ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మంత్లీ టార్గెట్ ను నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవటం ప్రధాన కారణమనే చర్చ జరిగింది. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందనీ... ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందన్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుందనీ... ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com