TS : బీఆర్ఎస్‌ను బొంద పెడదాం.. కమ్యూనిస్టులకు రేవంత్ రిక్వెస్ట్

TS : బీఆర్ఎస్‌ను బొంద పెడదాం.. కమ్యూనిస్టులకు రేవంత్ రిక్వెస్ట్

భువనగిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి గెలుపు మంత్రం పఠించారు. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేందుకు కమ్యూనిస్టుల మద్దతు అవసరం అన్నారు. కమ్యూనిస్టు సోదరులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. మనమంతా కలిసి బీఆర్ఎస్, బీజేపీలను బొంద పెట్టాలన్నారు. కాంగ్రెస్ ను ఓడించాలని కేసీఆర్ అంటుండు.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్.. పోటీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకున్న వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.

కేటీఆర్ కామెంట్స్ కు కౌంటరిచ్చారు రేవంత్. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసాం.. 30 వేల ఉద్యోగాల వివరాలు ఇస్తాం.. దమ్ముంటే భువనగిరి సెంటర్ లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు కాంగ్రెస్ ను ఓడించాలా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించినందుకు కాంగ్రెస్ ను ఓడించాలా? 40 లక్షల కుటుంబాలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నందుకు కాంగ్రెస్ ను ఓడించాలా..? అని ప్రశ్నించారు. పదేళ్లలో ఒక్కరికి కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నారు.

పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకు కాంగ్రెస్ ను ఓడించాలా? అని ప్రశ్నించారు. వంద రోజుల్లో పేదల సంక్షేమానికి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళుతుంటే.. పదే పదే ప్రభుత్వం పడిపోతదని కేసీఆర్ అంటుండు.. ఇదేమైనా ఫుల్ బాటిలా పడిపోవడానికి.. ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతామని హెచ్చరించారు.

చామల కిరణ్ ను గెలిపిస్తే భువనగిరిని ట్రిపుల్ ఇంజన్ లా అభివృద్ధి చేస్తామని రేవంత్ చెప్పి జనంతో చప్పట్లు కొట్టించారు. చామల కిరణ్ ను గెలిపించండి.. యదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా మార్చుకుందామన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టు లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది.. వచ్చే పంటకు రూ.500 బోనస్ అందించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు. రేవంత్ కార్నర్ మీటింగ్ తో భువనగిరిలో కాంగ్రెస్ జోరు కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story