TG : రుణమాఫీ, రైతు భరోసా రూ.50వేల కోట్ల కోసం..! రేవంత్ నిధుల వేట

రాష్ట్ర ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా నిధుల సమీకరణపై సీఎం రేవంత్ సర్కారు దృష్టిపెట్టింది. బడ్జెట్లో కేటాయింపులకు ముందే మూడు కీలక పథకాలకు నిధుల సమీకరణ చేస్తోంది. రుణ మాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలు కోసం భారీగా రుణాల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది.
వచ్చే నెల 15లోగా రూ.2 లక్షల లోపు పంట రుణాలు మాఫీ చేస్తామంటూ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ.31 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేసింది. మరోవైపు (ఖరీఫ్) పంటల సాగు సీజన్ ప్రారంభమై ఇప్పటికే నెల గడిచింది. సెప్టెంబరుకు ముగిసే ఈ సీజన్లో రైతు భరోసా కింద ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయాల్సి ఉంది. ఈ పథకానికి కనీసం రూ.5 వేల కోట్లయినా తక్షణం అవసరమని ఓ అంచనా. మరోవైపు 18 నుంచి 59 ఏళ్లలోపు ఉన్న రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి రూ.1500 కోట్ల ప్రీమియంను ఎల్ఎస్ఐసీకి వచ్చే నెల 15లోగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
ప్రతి నెలా రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు బాండ్లను విక్రయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటోంది. జులై, ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయం ద్వారా రూ.15 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకూ తీసుకునేందుకు అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ భూములతో పాటుగా 'తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లకు పైగా రుణాలను సేకరించేందుకు అవకాశాలున్నాయని భావిస్తోంది. అవసరమైతే భూముల తనఖా ద్వారా నిధుల కోసం ప్రత్యేకంగా, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా రుణం తీసుకోవడంపైనా ఆలోచిస్తోంది. ఆగస్టు ప్రారంభం నుంచి రుణమాఫీ అమలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com