MicroLink Networks Industries : రూ.500 కోట్ల పెట్టుబడితో మైక్రోలింక్ నెట్ వర్క్స్ పరిశ్రమలు

అమెరికా టెలికమ్మూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్స్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణాలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రల క్లస్టర్ ను ప్రారంభిస్తుందని తెలిపారు. గురువారం నాడు మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి ‘పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు. వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్, ఐటీ, నిర్మాణరంగ పరికరాలను ఉత్పత్తి చేస్తుందని శ్రీధర్ బాబు వివరించారు. రానున్న మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇటీవల తన అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని అన్నారు. అనంతరం తెలంగాణాలో పెట్టుబడులకు అంగీకరించిందని శ్రీధర్ బాబు తెలిపారు. డేటా ట్రాన్స్ మిషన్, నెట్ వర్కింగ్ కేబుల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మల్టీ లెవెల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ గ్లోబల్ లీడర్ గా ఉంది. ఇప్పుడా కంపెనీ పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో పరిశ్రమలను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణాలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరతలేదని వెల్లడించారు. సమావేశంలో పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు, డైరెక్టర్ నమ్యుత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మరాజు చక్రవరం, మైక్రోటెక్ గ్లోబల్ ప్రతినిధులు డా. డెనిస్ మొటావా(Dr. Denis Motava), సియాన్ ఫిలిప్స్ (Sean Philips), జో జోగ్భి(Joe Zoghbi), అశోక్ పెర్సోత్తమ్ తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com