Robbery : అర్ధరాత్రి దొంగల హల్ చల్.. నాలుగు ఇళ్లలో చోరీ

తెలంగాణ (Telangana) రాష్ట్రం అచ్చంపేట మండలంలో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టిస్తున్నారు. చందాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దొంగలు పలు ఇండ్లలో చొరబడి హల్చల్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం బాధితులు తమ గోడు చెప్పుకున్నారు.
కొత్త ఇంట్లో నిద్రిస్తున్నామని పాత ఇంట్లో ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడి బీరువా లాకర్ ను గడ్డపారతో పెకిలించారని ఓ బాధితుడు మీడియాకు తెలిపాడు. రూ. 50 వేలు నగదు, రెండు తులాల బంగారం, 15 తులాల వెండి ఎత్తుకెళ్లి బట్టలు ఇంట్లో అంతా చిందరవందరగా పడేశారని వాపోయాడు. తన బైక్ ను కూడా ఎత్తుకెళ్లారన్నారు. ప్రమీలమ్మ ఇంట్లో చొరబడి నగదు పదివేలు, బాల్ రెడ్డి ఇంట్లో మరికొంత నగదు, అలాగే నర్సిరెడ్డి ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం చేశారనీ.. ఏమి దొరకకపోవడంతో వెళ్లిపోయారని గ్రామస్తులు మీడియాకు గోడు చెప్పుకున్నారు.
బుధవారం రాత్రి గ్రామంలో ఒకేసారి నాలుగు ఇళ్లల్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనాలకు పాల్పడడంతో గ్రామస్తులందరూ భయంతో వణికిపోతున్నారు. రాత్రిపూట గ్రామస్తులు ఆరుబయట నిద్రిస్తుంటామని ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఇబ్బందికరంగానే ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. అచ్చంపేట సీఐ రవీందర్ గ్రామానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అవసరమైతే రాత్రి పూట గస్తీ పెడతామని భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com