Gor Banjara Vachkarani Book : "గోర్ బంజారా వాచకరణి" పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు

మూడ కృష్ణ చవాన్ రచించిన "గోర్ బంజారా వాచకరణి" పుస్తకాన్ని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఆవిష్కరించారు. రవీంద్రభారతిలో నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. భారతదేశంలో 560కి పైగా పైగా భాషలు ఉండగా, భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 ఉన్నాయని, అయితే లిపి లేని భాషలూ ప్రజల వాడుకలో ఉన్న భాషలు మరెన్నో ఉన్నాయని అన్నారు. అలాంటి వాటిలో బంజారా భాష కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని, బంజారా భాషకి వ్యాకరణాన్ని రచించడం ద్వారా ఆ భాషకి శాస్త్రీయతను తీసుకువచ్చే ప్రయత్నం రచయిత మూడ కృష్ణ చవాన్ చేసారని మంత్రి ప్రశంసించారు. గతంలో ఆయన బంజారా భాషలో భగవద్గీతని రచించి బంజారా భాషలో కూడా గొప్ప సాహిత్యం రావడానికి కారణం అయ్యారని కొనియాడారు, ఈరోజు "గోర్ బంజారా వాచకరణి" అనే పేరుతో బంజారా భాషా వ్యాకరణ గ్రంధాన్ని భాషా సాంస్కృతిక శాఖ ముద్రించడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో అట్టడుగున ఉన్న సాంస్కృతిక సంపదను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నదని, ఆ క్రమంలోనే ఈరోజు ఎన్నెన్నో చరిత్రకు తెలియని విషయాలను పుస్తక రూపంలో, డాక్యుమెంటరీ రూపంలో సాంస్కృతిక శాఖ ద్వారా నిర్మిస్తూ ప్రచురిస్తూ వస్తున్నామని, ఈ పుస్తకం కూడా బంజారా భాష ఔన్నత్యాన్ని, వ్యాకరణాన్ని సులభంగా తెలియజేసే గ్రంథం అవుతుందని పేర్కొన్నారు. ఇదే కోవలో రాబోయే కాలంలో సాంస్కృతిక శాఖ ద్వారా మరిన్ని గ్రంధాలని ప్రచురించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రచయితని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com