TG : నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసు కూల్చేయండి: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండలో ఎలాంటి అనుమతులు లేకుండా రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో బీఆర్‌ఎస్ కార్యాలయం నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( Komatireddy Venkat Reddy ) ఆరోపించారు. అనుమతులు లేకుండా కట్టిన పేదలు ఇళ్లు నోటీసులు ఇచ్చి, కూల్చేసే అధికారులు బీఆర్‌ఎస్ ఆఫీసు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రశ్నించారు. వెంటనే కూల్చివేత జీవో ఇవ్వాలని ఆదేశించారు. ఆ స్థలంలో విద్యార్థులకు వసతి గృహాలను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. సోమవారం నల్లగొండ పట్టణంలో 13 కోట్ల రూపాయలతో 33 కెవి విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకు అక్రమ నిర్మాణానికి సంబంధించి నోటీసులు ఏమైనా ఇచ్చారా.? అని మున్సిపల్ కమిషనర్‌ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటివరకు రెండుసార్లు అందజేశామని కమిషనర్ సమాధానం చెప్పారు. పదిసార్లు అయినా నోటీసులిచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా అనుమతుల్లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వ్యవహారాన్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com