TG : పంటలకు నష్టం జరగొద్దు : మంత్రి శ్రీధర్ బాబు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. జిల్లా సరిహద్దులో ప్రవహిస్తున్న పెన్ గంగ నది ఉద్ధృతిని పరిశీలించారు. బ్యాక్ వాటర్ తో వందలాది ఎకరాల పంట చేలు నీట మునిగాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంత్రికి వివరించారు. రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్ రాజర్షి షాను ఆదేశించారు. అంతకుముందు నిర్మల్ జిల్లాలోని స్వర్ణ వాగు ఉధృతిని శ్రీధర్ బాబు పరిశీలించారు. జిల్లా కేంద్రం గుండా ప్రవహిస్తున్న స్వర్ణ వాగు ఉప్పొంగిన ప్రతిసారి పట్టణంలోని జీఎన్ఆర్ కాలనీ ముంపు నకు గురవుతున్నదని స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే , ఉన్నతాధికారులతో కలిసి జీఎన్ ఆర్ కాలనీని సందర్శించారు. కాలనీవాసులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని కాలనీవాసులకు ఆయన హామీ ఇచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com