Surypet Court : కూతుర్ని చంపిన తల్లికి మరణశిక్ష

దేవునికి పూజలు చేస్తుండగా కూతురు అడ్డు పడుతుందని కత్తితో ఏడునెలల చిన్నారిని గొంతు కోసి హత్య చేసిన కసాయి తల్లికి మరణశిక్ష విధిస్తూ సూర్యాపేట ఒకటవ వాదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ ఎం శ్యాం శ్రీ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ అదనపు పీపీ నాతి సవిందర్ తెలిపిన వివరాల ప్రకారం... మోతే మండలం బురకచర్ల గ్రామపంచాయతీ మేకల తండాకు చెందిన భానోతు కృష్ణకు అదే గ్రామానికి చెందిన ధరావత్ బదులు కూతురు భారతితో 2019 జున్ నెలలో వివాహం జరిగింది. వారికి ఏడు నెలల పాప పొట్టి ఉంది. 2017లో వివాహానికి ముందు ధరావత్ భారతికి సర్ప దోషం ఉందని గుర్తుతెలియని వ్యక్తి చెప్పడంతో అప్పటినుంచి పూజలు పునస్కారాలు చేస్తూ ఉండేది. వివాహమైన కొంతకాలం సక్రమంగానే ఉన్నప్పటికీ 2021 జనవరి నెలలో తనకు సర్ప దోషం ఉన్నందున భవిష్యత్తులో జరగబోయే తెలిసి పిచ్చిపిచ్చిగా చేస్తుండడంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలో మానసిక వైద్యుని సంప్రదించారు.
డాక్టర్ మందులిచ్చిన భారతి మందులు వేసుకోకుండా శివపార్వతుల విగ్రహాలకు పూజలు చేస్తూ దీపాలు పెడుతూ పూజలు చేస్తుండేది. 2021 ఏప్రిల్ 15న బానోతు కృష్ణ ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్లో ఉన్న తన అక్క ఇంటికి వెళ్లారు. ఆరోజు సాయంత్రం అందాజ నాలుగున్నర సమయంలో భారతి డ్రెస్సింగ్ రూమ్ వద్ద పూజలు చేస్తుండగా ఏడు నెలల ఆమె కూతురు పొట్టి తరచూ తల్లి వద్దకు వస్తుండడంతో పూజలకు ఆటంకం కల్పిస్తుందని నెపంతో కత్తితో తన కూతురు గొంతు కోయడంతో ఏడు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని కృష్ణకు బావమరిది రవి చరవాణిలో తెలుపగా హుటాహుటిన ఇంటికి చేరుకున్న కృష్ణ తన కూతురు విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించారు. తన భార్య పారిపోవడంతో కృష్ణ మోతె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అప్పడి ఎస్ఐ భూమగళ్ల ప్రవీణ్ కుమార్ నిందితురాలపై కేసు నమోదు చేయగా అప్పటి మునగాల సీఐ ఆంజనేయులు చార్జి షీటు దాఖలు చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లా ఒకటవ అదనపు కోర్టులో విచారణ జరుగుతుండగా సాక్షులను విచారించిన న్యాయమూర్తి ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవిస్తూ కన్న కూతురును చంపిన నేరానికి కసాయి తల్లికి ఉరిశిక్షతో పాటు 5000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితురాలికి శిక్షపడేలా ప్రాసిక్యూషను సహకరించిన కోర్టు లైజనింగ్ ఆఫీసర్ గంపల శ్రీకాంత్, కానిస్టేబుల్ నాగరాజు లతోపాటు అప్పటి సీఐ,ఎస్ఐ, ప్రస్తుత ఎస్ఐ, సిఐ రామకృష్ణారెడ్డి, డీఎస్పి శ్రీధర్ రెడ్డిలను ఎస్పీ అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com