TG DGP : చార్జ్ తీసుకున్న కొత్త డీజీపీ.. డ్రగ్స్ అరికట్టడంపైనే ఫోకస్

రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడే లక్ష్యంగా ముందుకు సాగుతామని కొత్త డీజీపీ సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ వెల్లడించారు. రాష్ట్ర డీజీపీగా జితేందర్ నియమిస్తూ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో రాష్ట్ర నూతన డీజీపీగా బుధవారం సాయంత్రం జితేందర్ అధికార బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పోలీసుశాఖలో ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేయాలన్నారు డీజీపీ జితేందర్.
ప్రజలు సైతం తమ వంతు బాధ్యతగా పోలీసులకు సహకరించాలని కోరారు కొత్త డీజీపీ. రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో నేరాల నియంత్రణకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతామన్నారు. పోలీసు శాఖలో హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు నిరంతరం సమిష్టి కృషితో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అవసరమని ప్రతి పోలీసు గుర్తించుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని డీజీపీ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com