MLC Notification : నేడు ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్

నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వరరావు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. మే 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, మే 10న నామినేషన్ల పరిశీలన ఉంటుందని వెల్లడించింది. మే 13న ఉపసంహరణకు చివరి తేదీగా పేర్కొంది. మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ప్రకటించింది. జూన్ 5న కౌంటింగ్ ఉంటుందని వెల్లడించింది.
ముఖ్య తేదీలు :
మే 2వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల.
మే 9వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ.
మే13న నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ.
మే 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్.
జూన్ 5న ఓట్ల లెక్కింపు.
ఇక గతంలో ఈస్థానం నుంచి అత్యంత కష్టం మీద గెలిచిన బీఆర్ఎస్.... మరోసారి గెలవటం అతిపెద్ద సవాల్ గా మారనుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉండగా.. కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఈ స్థానం నుంచి ఎవరు అభ్యర్థులుగా ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఈ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిన్ననే ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరేనిది తేలాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com