TG : వైద్యుల కోసం రోగులు పడిగాపులు

TG : వైద్యుల కోసం రోగులు పడిగాపులు
X

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానలో డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులకు కష్టాలు తప్పడం లేదు. అధునాతన వైద్య పరికరాలు కలిగిన ఈ దవాఖానకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక్కో రోజు ఒక్కో విభాగానికి చెందిన స్పెషలిస్ట్‌ వైద్యులు అందుబాటులో ఉంటారని అధికారులు ముందస్తుగా ప్రకటించారు. కానీ, వైద్యం కోసం వస్తున్న రోగులకు ఇక్కడ చుక్కెదురవుతోంది. సమయపాలన పాటించకుండా డాక్టర్లు గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఓపి విభాగంలో వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు సమయానికి రావడం లేదు. దవాఖానలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ నిర్వహిస్తారు. అయితే, డాక్టర్లు మాత్రం సమయ పాలన లేకుండా 10 గంటల తర్వాతనే వస్తుండడంతో రోగులు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం న్యూరో విభాగానికి సంబంధించిన ఓపీ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ముందే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఓపీలో పేరు నమోదు చేసుకుని సంబందిత డాక్టర్ల చాంబర్ల ఎదుట క్యూ కట్టారు. 10 గంటలు డాక్టర్లు రాలేదు. ఇది ఒక్క రోజు కాదు.. ప్రతి రోజూ ఓపీలో జరుగుతున్న తంతు ఇది బయోమెట్రిక్‌ హాజరు ఉన్న డాక్టర్ల తీరూ మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొంత మంది ప్రభుత్వ డాక్టర్లు సమయపాలన పాటిస్తున్నా కాంట్రాక్టు డాక్టర్లు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో నోడల్‌ ఆఫీసర్‌, కేఎంసీ ప్రిన్సిపాల్‌ సమయపాలన పాటించని డాక్టర్లను మందలించారు. అయినా వారి తీరు మారకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా వైద్యులు సకాలంలో ఓపీ సేవలు నిర్వహించాలని రోగులు కోరుతున్నారు.

Tags

Next Story