Political: ఖమ్మం - పార్టీలన్నిటికీ గుమ్మం

hyderabad
Political:  ఖమ్మం - పార్టీలన్నిటికీ గుమ్మం
చంద్రబాబు సమావేశానికి భారీ స్పందన, ఖమ్మం నుంచే వైఎస్ షర్మిల పోటీ; BRS ఆవిర్భావం తర్వాత కేసీఆర్ మొదటి బహిరంగ సమావేశం...


ఖమ్మంలో చంద్రబాబు సమావేశానికి భారీ స్పందన, వైఎస్ షర్మిల ఖమ్మం నుంచే పోటీ చేస్తారాట, BRS ఆవిర్బావం తర్వాత కేసీఆర్ మొదటి బహిరంగ సమావేశం ఖమ్మంలోనే, ఖమ్మం నేతలపై బీజేపీ గురి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏరాజకీయ పార్టీ చూసినా ఖమ్మం జిల్లా తమకు అత్యంత కీలకమని చెప్తున్నారు. కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ దాకా, బీజేపీ నుంచి టీడీపీ వరకూ అందరికీ ఖమ్మం అంటే ప్రత్యేకమే.. దానికి తగ్గ కారణాలూ సుస్పష్టం.

భిన్న భావజాలాల ప్రాతినిధ్యం.

భౌగోళికంగా మాత్రమనే కాదు రాజకీయంగా సామాజిక అంశాల పరంగానూ ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రాతినిధ్యం కలిగిన జిల్లా ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లాగా అభివర్ణిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ దాదాపు అన్ని పార్టీల ప్రాతినిధ్యం కలిగివుండే జిల్లా, పోరాటాలే కాదు, పొత్తులకూ ఖమ్మమే వారధి. అలా అని తెలంగాణ ఆవిర్భావానికి ఖమ్మం వ్యతిరేకమేమీ కాదు. 1969 ఉద్యమంలో తెలంగాణ కోసం జరిగిన విధ్యార్ది ఉద్యమంలో ఖమ్మం విధ్యార్ధులు పాత్ర కీలంకం. ఆ దశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన మొదటి విద్యార్ధి ఖమ్మం వాడే అని చెప్తారు.




తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మారిన రాజకీయ సమీకరణాల్లోనూ తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు ఖమ్మం ఓటర్లు ప్రాతినిధ్యం ఇచ్చి అసెంబ్లీకి పంపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ను అత్యధిక స్ధానాల్లో గెలిపించారు. తెలంగాణలో తెలుగుదేశం లేదు అనే విమర్శ అవాస్తవమని ఖమ్మం జిల్లా వాసులు తేల్చారు. పూర్తి వ్యతిరేక వాతావరణంలోనూ ఖమ్మంలో రెండు అసెంబ్లీ స్ధానాలు గెలిపించి ప్రతిపక్ష పార్టీల స్ధైర్యాన్ని నిలుపుతున్నారు.




2014లో సమైక్య రాష్ట్రమే తమ నినాదమన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కు సైతం ఓ ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్ధానాలిచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఖమ్మం రాజకీయం, ఖమ్మం జిల్లా వాసుల రాజకీయ చైతన్యం కచ్చితంగా ప్రత్యేకమనే చెప్పాలి.

కమ్యూనిస్టుల జెండా, కాంగ్రెస్ కు అండ

ఖమ్మంలో కారు పార్టీ ఎప్పుడూ పెద్దగా దూసుకుపోయింది లేదు. 2014, 2019ల్లో టీఆరెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్దానాన్నీ మాత్రమే గెలుచుకోగలిగినా తర్వాత నాయకులను తమవైపుకు రప్పించుకోగలిగింది. తుమ్మల నాగేశ్వర్రావు, పువ్వాడ అజయ్, నామా నాగేశ్వర్రావు వంటి సీనియర్లతో పాటూ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు చాలామంది టీఆరెస్ లో చేరినా ప్రజలు మాత్రం ఇప్పటికీ ప్రత్యామ్నాయ పార్టీలకు మంచి స్పందన తెలియజేస్తున్నారు.



ఇటీవలే జరిగిన పలు సమావేశాలకు హాజరైన కార్యకర్తలూ, అక్కడి నాయకులు చేస్తున్న ప్రకటనలూ, వేస్తున్న అడుగులు ఇందుకు రుజువులు. ప్రస్తుత ఖమ్మం జిల్లా రాజకీయ వాతావరణం తమకు పూర్తి అనుకూలంగా వుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ సారి కూడా జిల్లాలో అధిక స్ధానాలు గెలిపించుకుంటే తనకు రాష్ట్ర స్ధాయిలో తిరుగుండదనే భావనలో వున్నారు. పార్టీ ఇతర జిల్లాల్లో ఎలావున్నా ఖమ్మంలో మాత్రం మాకు కలిసొస్తుందని చెప్పుకుంటున్నారు. అందుకే స్ధానికేతర నాయకులు సైతం ఖమ్మం పై కన్నేసారు.




మరోవైపు ఖమ్మం కమ్యూనిస్టులు తమ పట్టు ప్రదర్శిస్తున్నారు. బీఆరెస్ గా మారిన టీఆరెస్ కు వారు రాష్ట్ర వ్యాప్త సహకారాన్ని అందిస్తున్నారు. ఈ స్నేహం ఇలాగే కొనసాగితే 2023 నాటికి బీఆరెస్ తో పొత్తు సుగమం అవుతుంది. అందులో భాగంగా తాము ఖమ్మంలోని స్ధానాలనే కోరుకుంటారు. అక్కడ వారికి ఇంకా పట్టున్న కార్యకర్తల బలం ఇటీవల జరిగిన రైతు సదస్సుకు భారీగా కార్యకర్తలు హాజరవడం ద్వారా తెలిపింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సభకు హాజరైన కార్యకర్తల సంఖ్యాబలాన్ని చూసి పార్టీ బలోపేతంపై ఆశాభావం వ్యక్తంచేశారట. వారి విద్యార్ధి, ఉపాద్యాయ సంఘాలు ఇంకా రాష్ట్ర రాజకీయ ఫలితాలను ప్రభావితం చేసే స్దాయిలోనే వున్నాయి.


టీడీపీ కి తిరిగి ఊపిరులిచ్చే వాతావరణం

తెలుగుదేశం పార్టీకి ఖమ్మంలో మంచి బలం వుండేది. 2014, 2018ల్లో ప్రతికూలతల్లోనూ గణనీయ సంఖ్యలో ఓట్లతో పాటు కొన్ని సీట్లూ దక్కించుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో తెదేపా పట్టు కోల్పోయినప్పటికీ కార్యకర్తల బలం మెండుగానే వుందనటానికి మొన్నటి తెలంగాణ టీడీపీ బహిరంగ సభ ఓ నిదర్శనం. ఇంత భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరవడమే తెదేపా ఎక్కడుందనేవారికి సమాధానమని చంద్రబాబు ఆ సభలో అన్నారు. ఈ ఉత్సాహం మాకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం చేసుకునేందుకు స్ధైర్యాన్నిచ్చిందని బాబు చెబుతున్నారు.




ఏపీతో సంబందాలు కలిగిన వారు, గణనీయ సంఖ్యలో కమ్మ సామాజిక వర్గ ఓట్లు తమ పార్టీని తెలంగాణ రాజకీయాల్లో సుస్థిరంగా వుంచుతాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నారు. సోడరుడు జగన్ తో విభేదాలతోనో లేదా తెలంగాణ రాజకీయాలపై ఆసక్తతోనో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు ఎక్కడా రాని స్పందన ఖమ్మం జిల్లాలో వచ్చింది. పాలేరు అసెంబ్లీనుంచి తాను పోటీ చేస్తానని షర్మిల ఇప్పటికే ప్రకటించడం ఆమె తండ్రి వైఎస్ పట్ల ఖమ్మం జిల్లాలో ఇంకా సానుకూలత వుందని స్పష్టంగా అర్ధం అవుతోంది. 2014వో వైసీపీ ఓ పార్లమెంటు, మూడు అసెంబ్లీ స్ధానాలు గెలుచుకోవడం కూడా ఆమె ఆశలకు మరో కారణం.


కేసీఆర్ కూ కీలకమే..


కొన్ని ప్రతికూలతలు ఉన్నాప్పటికీ బీఆరెస్ అధినేత కేసీఆర్ కూడా ఖమ్మం పై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు పెరగడం, నమ్మకమైన ఓటు బ్యాంకు సాధించుకోలేకపోవడం వంటివి అందులో కొన్ని. సంక్రాంతి తర్వాత ఉత్తరాయణంలో పార్టీ విస్తరణ వేగంగా ఉంటుదని చెప్పిన కేసీఆర్ పండక్కి ముందే దక్షణాయణం మొదలుపెట్టారు.




భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో వరుస టూర్లూ, భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కేవలం ఖమ్మం జిల్లా లో వుండే నాయకుల మధ్య అనైక్యతను సరిచేయడం మాత్రమే కేసీఆర్ ప్రాధాన్యత కాదంటున్నారు బీఆరెస్ ముఖ్యులు. జిల్లా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే కాదు చత్తీస్ఘడ్ రాష్ట్రానికీ ఖమ్మం పొరుగుజిల్లా. బీఆరెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రచారం కల్పించే క్రమంలో ఆయా రాష్ట్రాల ప్రజలకు ఖమ్మం నుంచే సందేశమిచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఏపీలో భాగమైన ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలతో ఖమ్మం వాసులకు దగ్గరి సంబంధాలుండటం అందులో ముఖ్య కారణం.




బీఆరెస్ గా ఆవిర్భవించి జాతీయస్ధాయి అంశాలపై దృష్టి పెట్టికి కేసీఆర్ కి సైద్దాంతికంగా బీజేపీ వ్యతిరేకులైన కమ్యూనిస్టు ఓటు బ్యాంకును ఆకట్టుకోవడం కూడా ఓ ముఖ్య లక్ష్యం. లెఫ్ట్ పార్టీలతో పొత్తు కు కూడా ఈ సభ ఓ అవకాశంగా వినియోగించుకోనున్నారు. మరోవైపు ఇప్పటికే సక్సెస్ ఐన టీడీపీ, కమ్యూనిస్టుల సభలకు ధీటుగా సభ నిర్వహించి తమ రాజకీయ దక్షిణాయనాన్ని చాటుకోవాలని చూస్తున్నారు గులాబీ నేత. రోజురోజకూ ఉత్కంఠ పెంచుతున్న తెలంగాణ రాజకీయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు ఎవరి పక్కనిలుస్తారో, ఎవరి భాగ్యరేఖను మారుస్తారో చూడాలి.




Pradeep kumar Bodapatla

Input Editor, tv5

Tags

Read MoreRead Less
Next Story