TS : కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి, అల్లుడు జంప్!

TS : కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి, అల్లుడు జంప్!

Telangana : తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని రసపట్టు కనిపిస్తోంది. పార్టీల మధ్య ఆధిపత్యం పెరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇద్దరు నేతలు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాజశేఖర్ రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్న సందర్భంగా ఈ పరిణామం తెరపైకి వచ్చింది.

ఈ ఉదయం మల్లారెడ్డి అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చి వేశారు. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు భారీగా కూల్చివేత పనులు చేపట్టారు. నగర శివారు దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఏరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌) ఆక్రమించి పార్కింగ్‌ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు ఏడు రోజుల కిందట యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు.

మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఈ పరిణామాలతో అలర్టైన మల్లారెడ్డి.. నష్టం లేకుండా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాజకీయ కార్యాచరణ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లోకి వెళ్తేనే రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చన్న అభిప్రాయంతో ఆయన, ఆయన కుటుంబసభ్యులు ఉన్నట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story