TS : బూర నర్సయ్య ఊర మాస్ సవాల్.. గెలవకపోతే గుడ్ బై

భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ (Boora Narsayya) సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరిలో తాను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యానించారు. చౌటుప్పల్ లింగోజి గూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బూర నర్సయ్య గౌడ్ .. ఇంతకు ముందు ఎంపీలుగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు భువనగిరి పార్లమెంట్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ము ధైర్యం ఉంటే మంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే అన్న వారిని చెప్పుతో కొడతామన్నారు బూర నర్సయ్య గౌడ్. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు గతంలో లేదు భవిష్యత్తులో కూడా ఉండబోదన్నారు. కాళేశ్వరంపై నానా హంగామా చేస్తున్న కాంగ్రెస్.. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేయాలన్నారు.
వృత్తిరిత్యా వైద్యుడైన బూర నర్సయ్య 20,000 లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్సలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో చురుకైన పాత్ర పోషించిన బూర నర్సయ్య 2013 జూన్ 2న టీఆర్ఎస్ లో చేరాడు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 30,300 ఓట్ల తేడాతో గెలుపొందారు. స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్, పార్లమెంటరీ కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీస్, కన్సల్టేటివ్ కమిటీ ఆన్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్, ఎంట్రప్రెన్యూర్‌షిప్ సభ్యుడిగా ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. బూర నర్సయ్య గౌడ్ 2022 అక్టోబర్ 15న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 2022 అక్టోబర్ 19న బీజేపీలో చేరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com