TG : ప్రైవేటుకు దీటుగా హరిత హోటళ్లు: మంత్రి జూపల్లి
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే హరిత హోటళ్లు, రిసార్ట్‌లను రానున్న కాలంలో ప్రైవేటు హోటళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ( Minister Jupally Krishna Rao ) తెలిపారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి గోల్కొండ ఫెస్ట్, తారామతి ఫెస్ట్‌లతోపాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. శుక్రవారం నార్సింగ్ సమీపంలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధాన ద్వారం వద్ద ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చాలని, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న తారామతి రిసార్ట్‌లో నిర్వహణ లోపాలు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్లే తగిన ఆదాయం రావడం లేదని తెలిపారు. తారామతి రిసార్ట్ ద్వారా ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోందని, సరైన నిర్వహణ ఉంటే ఈ ఆదాయం 5 రెట్లు పెరుగుతుందని చెప్పారు. మూడు నాలుగు నెలల్లో రాష్ట్రంలోని పర్యాటక హోటళ్లను ప్రైవేటు హోటళ్లకు దీటుగా తీర్చిదిద్దుతామన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com