Weather Alert : ఇక వానలే వానలు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలో ఐదు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణలో రెండురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని.. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీలో కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం చురుకుగా మారాయి. మరోవైపు రాష్ట్రంపైకి దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న ఐదు రోజులు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది
గురు, శుక్రవారాల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదేసమయంలో గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతోపాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని వివరించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com