Ts : ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు: సీఎం రేవంత్ రెడ్డి

నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని, పెద్ద ఎత్తున పేదలకు జకాత్, ఫిత్రా పేరుతో దానధర్మాలు చేస్తారని ఆయన గుర్తు చేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందన్నారు.
ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లాహ్ దీవెనలు పొందాలని సీఎం ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో క్రమం తప్పకుండా ఆచరించే కఠోర ఉపవాసాలు, దైవ ప్రార్థనలు.. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయన్నారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందని ఆయన గుర్తుచేశారు.
లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ, దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. వారి సంక్షేమానికి అవసరమైన నిధులు కేటాయించి, వారి అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com