TS : పార్లమెంట్ ఎన్నికలు మా పాలనకు రెఫరెండమే: రేవంత్ రెడ్డి

తెలంగాణలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమే అని సీఎం రేవంత్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ’14 ఎంపీ స్థానాలు గెలవాలనేది మా లక్ష్యం. 4 నెలల పాలనలో అద్భుతాలు చేయకపోయినా తప్పులు చేయలేదు. పదేళ్లు దుర్మార్గాలు చేసిన కేసీఆర్ .. మాపై వ్యతిరేకత వచ్చిందని, కూలగొడతాం, పడగొడతాం అని మాట్లాడుతున్నారు. చంద్రబాబుపై వ్యక్తిగత ద్వేషం వల్లే ఏపీ లో జగన్ గెలుస్తారని కేసీఆర్, కేటీఆర్, అంటున్నారు’ అని చెప్పారు.
ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతి పిత అని సీఎం రేవంత్ అన్నారు. ‘అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కోదండరామ్ జేఏసీ ఛైర్మన్ అయిన తర్వాతే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. కేసీఆర్ ఉద్యమం ముసుగులో అధికారం చేపట్టారు. ఆస్తులు పెంచుకుని అవినీతికి పాల్పడ్డారు. కేసీఆర్‌పై ఎవరికీ జాలి లేదు. ఆయన అబద్ధాలతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది’ అని ఆయన మండిపడ్డారు.
వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రారు. సొంత నిర్ణయాలు తీసుకోను. పదేళ్ల తర్వాత పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చేపడతా. ప్రజలెవరూ బీఆర్ఎస్ మీటింగ్‌లకు వెళ్లడం లేదు. కేసీఆర్‌లో ఇప్పటికైనా మార్పు రావాలి. పవర్ కట్‌పై కేసీఆర్ ఆరోపణలు అన్నీ అవాస్తవం. ప్రతిపక్షనేతగా ఆయన హుందాగా వ్యవహరించడం లేదు’ అని ఆయన విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com