TG : మహిళలకు రేవంత్ మరో వరం.. రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు

మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) సర్కార్ వారికి మరో వరాన్ని ప్రకటించింది. కేరళలో అక్కడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లు, బెంగాల్లో "దీదీ కా రసోయ్" పేరుతో నిర్వహిస్తున్న క్యాంటీన్ల తరహాలో అన్నార్థులకు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక స్థలాలు, దేవాలయాలు, బస్ స్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళలతో క్యాంటీన్లు ప్రారంభించే యోచనలో తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది.
బెంగాల్లో ప్రభుత్వ ఆస్పత్రులలో మహిళలతో "దీదీ కా రసోయ్" క్యాంటీన్లను మహిళలచే నిర్వహించేలా ప్రభుత్వం ఆర్థిక సాయమందించి ప్రోత్సహిస్తోంది. వారు నాణ్యమైన ఆహారాన్ని పేషెంట్లు, సహాయకులకు అందిస్తున్నారు. 67 కేంద్రాలలో అక్కడ వీటిని నడుపుతున్నారు. ఇదే తరహాలో తెలంగాణలోనూ మహిళా స్వయం సహాయక బృందాలను పటిష్టం చేయడం, వారిని అన్ని రంగాలలో పురోగమించేలా చేయూతనిచ్చే చర్యల్లో భాగంగా ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందిస్తోంది.
ప్రభుత్వం రానున్న రెండేళ్లలో కనీసం 150 క్యాంటీన్లను ( Canteens ) ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్టు సీఎస్ తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై ఈ సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ ను సీఎస్ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com