CM Stalin Praises : రేవంత్ చేతల మనిషి.. సీఎం స్టాలిన్ ప్రశంస

నియోజక వర్గాల పునర్విభజనపై తెలంగాణ శాసనసభలో ఒక ముఖ్యమైన మైలురాయిలా నిలిచిపోయే తీర్మానం చేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటలను చేతల్లో నిరూపించారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొనియాడారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనను వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణ శాసనసభ గురు వారం తీర్మానం చేసిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
న్యాయం, సమానత్వం, సమాఖ్య స్ఫూర్తిని సమర్థిస్తూ సరైన రీతిలో పున ర్విభజన కోరుతూ తెలంగాణ శాసనసభలో తీర్మానం చేశారని ఆయన కితాబిచ్చారు. చెన్నైలో ప్రతిపాదించిన అంశాలు హైదరాబాద్లో నెరవేరాయని వ్యాఖ్యానించారు. ఇది ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఐక్యకార్యాచరణ సమితి రెండో సమావేశం నేపథ్యంలో మరిన్ని రాష్ట్రాలు అదే బాటలో నడుస్తాయని తమిళనాడు సీఎం అభిప్రాయపడ్డారు. పునర్విభజన విషయంలో తమిళనాడును అనుసరిస్తూ, ఈ చర్య మన ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా ప్రతిఘటించే సమష్టితత్వాన్ని బలోపేతం చేస్తుందని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. భారతదేశ భవిష్యత్తును అధర్మ మార్గాన ఒక ప్రాంతానికి అన్యాయం చేసే రీతిన రాసేందుకు ప్రయత్నించే ఎవరినీ అనుమతించబోమని ఈ సందర్భంగా స్టాలిన్ స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com