TS : మేం వెంటపడ్డాం.. రేవంత్ రుణమాఫీ ప్రకటించాడు.. హరీశ్ రావు హాట్ కామెంట్

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో రైతు ప్రయోజనాల పట్ల క్రెడిట్ గేమ్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ ప్రకటనపై తనదైన శైలిలో స్పందించారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. అధికారం చేపట్టిన తొలిరోజుల్లోనే డిసెంబర్ 9న నాడే రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలని, రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని హరీశ్ విమర్శించారు. ఎకరానికి రూ.15వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదు? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు రూ.2500 హామీ ఏమైంది.. కొత్త పెన్షన్ రూ.4వేలు ఇంకెప్పుడు పెంచుతారు.. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేదు.. ఎన్నికల కోసం ఓట్ల రాజకీయం చేస్తూ తప్పుడు హామీలు ఇస్తున్నారంటూ.. హరీశ్ రావు బ్యాక్ టు బ్యాక్ రేవంత్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com