TS : సీఎం రేవంత్‌ను కలిసిన రోహిత్ వేముల తల్లి
రోహిత్ వేముల తల్లి రాధిక వేముల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రోహిత్ వేముల కేసును పోలీసులు క్లోజ్ చేశారన్న వార్తలు దుమారం రేపాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల మృతి కేసును సైబరాబాద్ పోలీసులు క్లోజ్ చేసినట్లు వచ్చిన కథనాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేసినట్లు గచ్చిబౌలి పోలీసులు తెలుపుతూ.. తుది నివేదికను కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు నుంచి హెచ్‌సీయూ మాజీ వైస్‌ఛాన్స్‌లర్ అప్పారావును తప్పించారు. రోహిత్ ఎస్సీ కాదని హైకోర్టుకు రిపోర్ట్ సమర్పించారు. తనది ఫేక్ ఎస్సీ సర్టిఫికెట్ అని తేలితే సాధించిన డిగ్రీలు కోల్పోవడంతో పాటు శిక్ష పడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ పరిణామం తాజాగా దుమారం రేపింది.
రోహిత్ వేముల తల్లి సీఎం ను కలిసి.. తమకు న్యాయం జరిగేలా చూడాలని, సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. కాగా ఈ కేసును రీఓపెన్ చేశామని.. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఈ కేసును రీ ఓపెన్ చేసినందుకు రాధిక వేముల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించి తెలంగాణ డీజీపీ రవిగుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు. కేసును మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు డీజీపీ రవిగుప్తా తెలిపారు. 2016 జనవరి 17వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యపై గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com