TS : రూ.3వేల లంచం.. అధికారికి నాలుగేళ్ల జైలు

లంచం కేసులో నేరం రుజువు కావడంతో కరీంనగర్ ఏడీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ అన్నారెడ్డి ప్రాణవేందర్ రెడ్డికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమారి వివేక్ గురువారం తీర్పునిచ్చారు. ప్రస్తుతం ప్రాణవేందర్రెడ్డి గంగాధర వ్యవసాయ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన దైవాల శ్రీనివాస్ 2013 ఆగసు 27న అదే గ్రామంలో ఎరువుల దుకాణం అనుమతి కోసం కరీంనగర్ లోని అని డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసులో దరఖాస్తు చేసుకున్నాడు. కరీంనగర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అన్నారెడ్డి ప్రాణవేందర్ రెడ్డి శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్న ఫైలును పైఅధికారులకు పంపి అనుమతి ఇప్పించేందుకు రూ.3 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో శ్రీనివాస్ నేరుగా కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి, ఏసీబీ అధికారులు 2013 సెప్టెంబర్ 5న శ్రీనివాస్ నుంచి లంచం తీసుకుంటున్న ప్రాణవేందర్ రెడ్డిని ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు.
అనంతరం అతనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ డీఎస్సీ ఈ కేసుపై దర్యాప్తు జరిపారు. సాక్షులను అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ కుమార్ కోర్టులో ప్రవేశపెట్టి విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి వివేక్ కుమార్ నిందితుడు ప్రాణవేందర్రెడ్డికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com