Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు

తెలంగాణలో పెను ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో గత ఎన్నికల పోలింగ్ దాకా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందని నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబి మాజీ డిఎస్‌పి ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 1200 మంది ఫోన్లు టాప్ చేసినట్టు వెల్లడించారు. రాజకీయ పార్టీల నేతలు, ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇలా 1200 మంది ఫోన్లు టాప్ చేసినట్టు వెల్లడించారు. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సహాయంతో 17 సిస్టంల ద్వారా, 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ట్యాపింగ్ కొనసాగించినట్లు తెలిపారు.

ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నానని, అధికారికంగా మూడు ఫోన్లను ఉపయోగించానని, అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు ఫోన్ ట్యాపింగ్ ను మానిటర్ చేశానని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామని, అనంత్, శ్రీనివాస్ సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా ట్యాపింగ్ చేశామన్నారు. ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. ఎస్‌ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ ఆపేశాం, పట్టుకున్న డబ్బు మొత్తాన్ని ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డులలో చూపించామన్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుసటిరోజు నుండి ఫోన్ ట్యాపింగ్‌ను ఆఫ్ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించారన్నారు.

ఆయన ఆదేశాలతో 50కొత్త హార్డ్ డిస్క్ లను తీసుకువచ్చి, పాత వాటి స్థానంలో కొత్త హార్డ్ డిస్క్ లను ఫిక్స్ చేశామని వెల్లడించారు. 17హార్ట్ డిస్క్ లలో అత్యంత కీలకమైన సమాచారం ఉండడంతో వాటిని కట్టర్ల సహాయంతో కట్ చేసి ధ్వంసం చేశామన్నారు. సిడిఆర్ తో ఐడిపిఆర్ డేటా మొత్తాన్ని కూడా కాల్చివేశామన్నారు. ల్యాప్ ట్యాప్ లు, పెన్ డ్రైవ్ లు, హార్ట్ డిస్క్ లలో ఉన్న డేటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామని వెల్లడించారు. ఆపై ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లు, తదితరాలను నాగోల్, ముసరాంబాగ్ సమీపంలోని మూసీనదిలో పారేశాం అని ప్రణీత్‌రావు తెలిపారు. తాము ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు బేగంపేట నాలాలో పారేశామని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ ఫోన్ టాపింగ్ కు సంబంధించిన సమాచారాన్ని ధ్వంసం చేయాలని సూచించారని, ఆయన ఆదేశాలతోనే అలా చేశామని ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు.

Tags

Next Story