BREAKING : ఆర్మూర్ జీవన్ రెడ్డికి సజ్జనార్ షాక్

BREAKING : ఆర్మూర్ జీవన్ రెడ్డికి సజ్జనార్ షాక్
X

బీఆఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి TSRTC సంస్థ షాకిచ్చింది. గత కొంత కాలంగా జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ అండ్ మల్టిప్లెక్స్ భవనానికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో.. హైకోర్టు ఉత్తర్వులు మేరకు భవనాన్ని టీఎస్ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. "హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్‌స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకుంది TSRTC.

ఆర్టీసీకి చెందిన 7వేల 59 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ కంపెనీ B.O.T కింద 2013 జూన్ 1న లీజుకు తీసుకుంది. 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని.. మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేక్‌ఓవర్‌ చేసుకున్నారు. షాపింగ్‌ మాల్‌కు జీవన్‌ రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీపెక్స్‌‌గా పేరుపెట్టారు. థర్డ్‌ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజ్‌కు ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు.

బకాయిలు చెల్లించాలని గత ఐదేళ్లలో 20కి పైగా నోటీసులు జారీ చేసింది TSRTC. హైకోర్టు ఉత్తర్వులు, అద్దె ఒప్పంద నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి.. భవనాన్ని స్వాధీనం చేసుకుంది TSRTC. అద్దె బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రం రాజీ పడదన్నారు సజ్జనార్. టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ అన్నారు. నిబంధనల మేరకే బకాయిలు వసూలు చేస్తామంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు సజ్జనార్.

Tags

Next Story