ACB : ఏసీబీకి చిక్కిన భద్రాచలం ఎస్‌ఐ, కానిస్టేబుల్

ఓ చోరీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ ఎస్‌ఐ, కానిస్టేబుల్, సీసీటెక్నీషియన్, మరో ఘటనలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం లంచం తీసుకుంటూ టౌన్‌ప్లానింగ్ సూపర్ వైజర్ ఏసీబీకి పట్టుబడ్డారు. భద్రాచలంలో ఈనెల 12న పాత మార్కెట్ గోడౌన్‌లో మర్రి సాయితేజ, మరో ఇద్దరు మిత్రులతో కలిసి నాలుగు చెక్కర బ్యాగులను దొంగతనం చేశాడు. స్టేషన్‌లో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ శంకర్ గోడౌన్‌లోని సీసీ కెమెరాల్లో గమనించి ఎస్‌ఐ శ్రీనివాస్‌కు సమాచారం అందించారు. చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని చెక్కర బ్యాగులు, వారి ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు.
అనంతరం కానిస్టేబుల్ శంకర్ ముగ్గురు నిందితులను తలా రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాయితేజ ఈ విషయంపై ఖమ్మంలోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈనెల 15న లంచం నగదు రూ.20 వేలకు తగ్గించాలని సాయితేజ పోలీసులను కోరగా, వారు అందుకు తిరస్కరించారు. దీంతో పథకం ప్రకారం సాయితేజ గురువారం రూ.20 వేలు కానిస్టేబుల్ శంకర్‌కు ఇచ్చాడు.
వెంటనే ఆయన ఎస్‌ఐ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి చెప్పగా.. సాయంత్రానికి మరో రూ.5 వేలు కచ్చితంగా ఇవ్వాలంటూ ఎస్‌ఐ వారిని ఆదేశించారు. అనంతరం కానిస్టేబుల్ వారికి ఆటోను అప్పగించి, సెల్‌ఫోన్లను కూడా ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకరశెట్టి శంకర్, సీసీ కెమెరా టెక్నీషియన్ కర్నాటి నవీన్‌లను అరెస్టు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com