TG : కాంగ్రెస్‌లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

TG : కాంగ్రెస్‌లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
X

బీఆర్ఎస్ కు శుక్రవారం పొద్దున్నే భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ను దెబ్బతీసే విధంగా ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో గురువారం బాగా పొద్దుపోయాక కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాదరావు (కరీంనగర్). బుగ్గారపు దయానంద్ (రంగారెడ్డి), ఎగ్గె మల్లేశం(రంగారెడ్డి). బసవరాజు సారయ్య (వరంగల్), ప్రభాకర్ రావు (హైదరాబాద్) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా జూబ్లీ హిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే దసపల్లా హోటల్లో బస చేసి సీఎం నివాసానికి వచ్చిన ఎమ్మెల్సీలతో సమావేశమైన రేవంత్ వారితో కాసేపు సమాలోచనలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

శాసనమండలిలో 40 మంది సభ్యులుండగా రెండు ఖాళీలున్నాయి. మిగతా 38 మంది సభ్యుల్లో బీఆర్ఎస్ కు 30 మంది సభ్యులుండగా కాంగ్రెస్ పార్టీకి అరుగురున్నారు. ఇందులో జీవన్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ కాగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల తరపున ఎమ్మెల్సీగా గెలిచిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా అడపా దడపా ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు.

తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలం 12కు చేరింది. వచ్చే నెలలో శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతుండడం, ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ బిల్లులు తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం రచించి వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్సీలను బయటకు లాగాలని నిర్ణయించి ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. బడ్జెట్, బిల్లులు తిరస్కరణకు గురైతే పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని ఉహించిన సీఎం రేవంత్రెడ్డి అవసరమైనంత మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవాలని భావించి పథకం రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది.

Tags

Next Story