TG: ఆకట్టుకుంటున్న మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు

TG: ఆకట్టుకుంటున్న మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు
ఓట్ల ఆవశ్యకత తెలిసేలా ఏర్పాటు... యువత ఎక్కువ శాతం ఓటు వేసేలా చర్యలు

తెలంగాణ వ్యాప్తంగా ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఎంపిక చేసిన పలు పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా వీటిని తీర్చిదిద్ది.. ఓటు ఆవశ్యకతను అందరికీ తెలిసేలా చేస్తున్నారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాలను మహిళలే పూర్తిగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా యువత ఎక్కువ శాతం ఓటు వేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు అట్టహాసంగా మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌లను ప్రారంభించారు. ఎస్‌ఆర్‌ నగర్‌, సైదాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలను సుందరంగా అలంకరించారు. కేపీహెచ్‌బీ కాలనీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మహిళల కోసం ఆదర్శ మహిళ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఓటరు లోపలికి వచ్చే క్రమంలో ఆహ్వాన తోరణాలు.. కేంద్రంలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఏర్పాటు చేశారు.


నిర్మల్ జిల్లాలో 10 మోడల్ పోలింగ్ స్టేషన్లు సిద్ధమయ్యాయి. 7 సాధారణ మోడల్ పోలింగ్ స్టేషన్లుగా ఏర్పాటు చేయగా నిర్మల్‌లోని ఈద్గాం ఉర్దు పాఠశాలలో తీమాటిక్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసారు. వెదురు కర్రలు కొబ్బరి ఆకులు, మామిడి కొమ్మలతో పందిరివేసి , తోరణాలతో అలంకరించారు. నిర్మల్‌కు ప్రత్యేకత తీసుకొచ్చిన కొయ్యబొమ్మలు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవపూర్‌లో మహిళా పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం ఎన్నికల సిబ్బంది పోలింగ్ స్టేషన్‌కు చేరుకోగానే.. వారికి గుస్సాడీ నృత్యాలతో పంచాయతీ సిబ్బంది స్వాగతం పలికారు. సన్నాయి, మేళతాళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


మెదక్‌ లోక్‌సభలోని సిద్దిపేట జిల్లా తొగుటలోని 129వ పోలింగ్ బూత్ ను అధికారులు ఆదర్శ పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, చల్లని మంచినీరు ఉండేలా పోలింగ్ కేంద్రాన్ని ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. ఖమ్మంలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సుందరంగా తీర్చి దిద్దారు. ప్రత్యేకంగా యువత ఆదర్శకేంద్రం, దివ్యాంగులకు, మహిళలకు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు విలువ తెలుపుతూ చిత్రాలు అతికించారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలోని 190 వ పోలింగ్ కేంద్రాన్ని ఆదర్శ పోలింగ్ కేంద్రంగా తీర్చిదిద్దారు. ఓటర్లను ఆకర్షించేందుకు పోలింగ్ కేంద్రం ముందు ముగ్గులు వేసి అలంకరించారు.

Tags

Next Story