TS : ధరణి ట్రబుల్ షూట్.. ఇవాళ్టి నుంచే స్పెషల్ డ్రైవ్

Dharani Portal : ధరణి పోర్టల్‌లో చాలా పెండింగ్ సమస్యలను గుర్తించింది రేవంత్ రెడ్డి సర్కార్. వాటిని పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి ఒకటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. లక్షలాది దరఖాస్తులకు పరిష్కారం చూపాలని భావిస్తోంది. ఈ నెల 9వ తేదీ వరకు ఈ డ్రైవ్ కొనసాగనుంది.
సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ చూపాలని.. ఈ ప్రక్రియను సక్సెస్ చేయాలని ప్రభుత్వం వారిని కోరింది. రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు తహసీల్దార్ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటయ్యే ఈ బృందాల్లో అందుబాటులో ఉన్న రెవెన్యూ సిబ్బందితో పాటు పారాలీగల్ వాలంటీర్లు, కమ్యూనిటీ సర్వేయర్లు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను కూడా నియమించాలని ప్రభుత్వం సూచించింది.
వీరికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి గ్రామాల వారీగా ఈ బృందాలకు అప్పగించాలని తెలిపింది. దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై సమాచారం దరఖాస్తుదారులకు మెసేజ్ రూపంలో వస్తుంది. ఈ బాధ్యత వీఆర్వోలకు అప్పగించింది. అసైన్డ్, ఇనామ్, పీవోటీ, భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూముల సమస్యలు పరిష్కారం అయ్యే చాన్సుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com