Special Trains : మేడారం జాతరకు ఐదు రోజులు స్పెషల్ రైళ్లు..

Medaram మేడారం మహా జాతరకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ఈనెల 21న ములుగు జిల్లాలో మేడారం జాతర ప్రారంభం కానున్న సందర్భంగా ప్రత్యేక జన సాధారణ రైళ్లను నడపనున్నట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఐదు రోజుల పాటు, నిజామాబాద్ నుంచి వయా సికింద్రాబాద్, వరంగల్ మధ్య 4 రోజుల పాటు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో పాటు కాగజ్ నగర్ నుంచి వరంగల్ వరకు మరో ప్రత్యేక రైలు అందుబాటులో ఉందన్నారు. రైల్వేస్టేషన్ నుంచి నేరుగా మేడారం వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని, భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ ట్రైన్స్ సికింద్రాబాద్, హైదరాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, భోంగీర్, జనగాం, ఘన్‌పూర్, కామారెడ్డి, మనోహరాబాద్, మేడ్చల్, ఆలేరుతో పాటు పలు కీలకమైన స్టేషన్లలో ఆగనున్నాయి.
స్పెషల్ ట్రైన్ల వివరాలు..
సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్-సిర్పూర్ కాగజ్‌నగర్ (ట్రైన్ నెంబర్ 07017/07018)
సికింద్రాబాద్-వరంగల్-సికింద్రాబాద్ (ట్రైన్ నెంబర్ 07014/07015)
నిజామాబాద్-వరంగల్-నిజామాబాద్ (ట్రైన్ నెంబర్ 07019/07020 )
ఇక మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. ఆ బస్సులను నేటి నుంచి నడపాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల బస్సుల ద్వారా 35 లక్షల మంది భక్తులను మేడారం తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఒక్క వరంగల్ ప్రాంతం నుంచే సుమారు 2,500 బస్సులను నడపనుండగా..రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా బస్సులను నడిపేందుకు అధికారులు రెడీ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com