TS: ఇవ్వాళ ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

Telangana : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి (Delhi) వెళ్లనున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లోక్‌సభ సీట్ల అభ్యర్థుల ఖరారుపై ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) నిర్వహించే భేటీలో పాల్గొననున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ భేటీలో పాల్గొంటారు.
వాస్తవానికి ఆదివారమే సీఈసీ సమావేశం జరగాల్సి ఉంది. ఇందుకోసం రేవంత్, భట్టి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అయితే సోమవారానికి సమావేశం వాయిదా వేసినట్లు ఏఐసీసీ కొన్ని గంటల ముందే సమాచారం ఇచ్చింది. దీంతో రేవంత్ తన పర్యటనను వాయిదా వేసుకోగా.. భట్టి ఆదివారమే ఢిల్లీకి వెళ్లిపోయారు. ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బీఆర్‌ఎస్ ఎంపీ కె.కేశవరావు కూడా ఆదివారమే కాంగ్రెస్‌లో చేరాల్సి ఉంది. ఆయన చేరిక సైతం సోమవారానికి వాయిదా పడింది.
మరోవైపు కాంగ్రెస్.. 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను కూడా నియమించింది. పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షీ ఆదేశాల మేరకు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిండెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ఇంకా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com