Telangana Folk Singer : తెలంగాణ ఫోక్ సింగర్ శృతిది ఆత్మహత్యా..? హత్యా?

తెలంగాణ ఫోక్ సింగర్ శృతి అనుమానాస్పద మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది శృతి. అయితే కట్నం కోసం అత్తింటి వారే హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. శృతికి చిన్నతనం నుంచి సింగర్ అవ్వాలని కోరిక. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్‌గా మారి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్ధిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. 20 రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకెళ్లి అమ్మానాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో సంబురంగా అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి వేధింపులు మొదలయ్యాయి. కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించారని తెలుస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా కట్నం కోసం వేధిస్తూ కాలయముడుగా మారాడని ఆరోపిస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేని శృతి.. ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. తన కూతురును భర్త, అత్తమామలే చంపారని శృతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్ ఉన్న శృతి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com