Telangana Formation Day : జూన్ 2 న కీరవాణి, అందేశ్రీకి సన్మానం

ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ట్యాంక్‌బండ్‌పై ‘జయ జయహే తెలంగాణ’ గీత రచయిత అందెశ్రీ, సంగీతం అందించిన కీరవాణిని ప్రభుత్వం సన్మానించనుంది. ట్యాంక్‌బండ్‌పై తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్‌స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. 700 మందితో తెలంగాణ కళారూపాల కార్నివాల్, 70ని.షాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, 5వేల మందితో జాతీయ జెండాలతో ఫ్లాగ్‌వాక్ ఉంటుంది. ఫ్లాగ్‌వాక్ సమయంలో తెలంగాణ గీతం విడుదలవుతుంది.
రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 3 చరణాలతో 2.30 నిమిషాల నిడివితో సంక్షిప్త గీతాన్ని రూపొందించినట్లు చెప్పారు. అధికారిక చిహ్నం ఇంకా ఖరారు కాలేదని, తెలంగాణ తల్లి రూపంపైనా అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా కాకతీయ కళా తోరణాన్ని ముఖద్వారంగా ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజముద్రలో రాచరిక ఆనవాళ్లుగా కాకతీయ తోరణం, చార్మినార్ ఉన్నాయని, వాటిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
సీఎం షెడ్యూల్
దశాబ్ది వేడుకల సందర్భంగా జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తారు. అనంతరం ఉ.10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్‌ఫాస్ట్ తర్వాత అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ట్యాంక్ బండ్‌పై నిర్వహించే వేడుకలకు సీఎం హాజరవుతారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా పాల్గొంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com