TS: తెలంగాణలోనూ కొనసాగుతున్న పోలింగ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలతో పాటు, సికింద్రాబాద్ కంటోన్మెంటు ఉపఎన్నికకు కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం అయిదున్నర గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మాక్ పోలింగ్ కొనసాగుతోంది. ఏడు గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. తీవ్రవాద ప్రాబల్యమున్న 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. 3కోట్ల 32 లక్షల ఓటర్లు 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇప్పటికే లక్ష 88 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా.. మరో 21 వేల 960 మంది ఇంటి నుంచి ఓట్లు వేశారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా, తప్పనిసరిగా ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కోరారు.
తెలంగాణలో లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం అయిదున్నర గంటల నుంచి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈవీఎంల మొరాయింపు వంటి సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే సరిచేసేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ముగ్గురు ఈసీఐఎల్ ఇంజినీర్లను నియమించారు. నమూనా పోలింగ్ ముగిసిన తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. తీవ్రవాద ప్రాబల్యమున్న 5 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుండగా.. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి సెగ్మెంటు, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో సాయంత్రం 4 వరకే పోలింగ్ జరుగుతోంది.
17 లోక్ సభ నియోజకవర్గాల్లో 525 అభ్యర్థులు బరిలో నిలవగా.. వారిలో 50 మంది మహిళలు ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 68 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు కాగా.. 285 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 45 మంది పోటీలో ఉండగా.. అతితక్కువగా ఆదిలాబాద్‌లో 12 మంది బరిలో నిలిచారు. అభ్యర్థుల భవితవ్యాన్ని 3 కోట్ల 32 లక్షల 32 వేల 318 మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటీ 65 లక్షల 28 వేల 366 మంది పురుషులు ఉండగా.. కోటీ 67 లక్షల ఒక వెయ్యి 192 మంది మహిళా ఓటర్లు, 2 వేల 760 ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 35 వేల 809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 94 వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో ఉండనున్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, నిర్మల్, మెదక్, భువనగిరి, నిజామాబాద్, ములుగు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాల్లో ఈసారి అదనంగా 453 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అతికొద్ది మంది ఓటర్లు ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ బూత్ లో ఆరుగురు సిబ్బంది ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు APOలు, ఒక OPO, ఒకBLO, ఒక వాలంటీర్ విధుల్లో ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 94వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రంలో 597 పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలు, 119 బూత్‌ల్లో దివ్యాంగులు, 119 కేంద్రాల్లో యువత మాత్రమే పోలింగ్ విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీరు, వైద్య సదుపాయాలతో పాటు కుర్చీలు, ఫ్యాన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Tags
- TELANGANA
- PARLIMENT
- ELECTION
- VOTING
- STARTED
- VOTER PROTEST
- IN FRONT
- OF YCP OFFICE
- ABOUT
- VOTE MONEY
- AP POLLING
- IN DISTRICTS
- ANDHRAPRADESH
- ASSEMBLY
- MP ELECTION
- POLIING START
- TELUGU DESHAM PARTY
- LEADERS
- MEET
- CEC
- IN DELHI
- Chandrababu
- supporters
- CHANDRABABU
- Chandrababu. family members. Pawan kalyan
- clarity
- 2024 elections
- cbn
- tdp
- chandrababu naidu
- tv5
- tv5news
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com