Tragic Death : రైస్ మిల్ గోదాం గోడ కూలి..ఇద్దరు బిహార్ కార్మికుల దుర్మరణం

రైస్ మిల్ గోదాం గోడ కూలి మీదపడడంతో బిహార్ నుంచి వచ్చి పని చేస్తున్న ఇద్దరు హమాలీలు చనిపోయారు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం శివారులోని భరణి రైస్ మిల్లులో జరిగింది. మిర్యాలగూడ రూరల్ పోలీసుల కథనం ప్రకారం..బిహార్ కు చెందిన సుమారు 50 మంది భరణి రైస్ మిల్లులో కొంతకాలంగా హమాలీలుగా పనిచేస్తున్నారు. సోమవారం గోదాంలోని బస్తాలను మిల్లింగ్ కోసం బయటకు తీసుకువస్తున్నారు. గోదాం మధ్యలో ఉన్న ఎత్తయిన గోడ కూలడంతో గమనించిన కొందరు బయటకు పరుగులు తీశారు. అక్కడే బస్తాలు ఎత్తుతున్న బిహార్‌కు చెందిన గంగా ప్రసాద్ (55) రఘువీర్ సాహూ (45)పై గోడ పడింది. దీంతోపాటు వందల బస్తాలు కూడా పడిపోయాయి. మిల్లు యాజమాన్యం, ఇతర హమాలీలు సమీపంలోని జేసీబీ తీసుకొచ్చి బస్తాలను తొలగించారు. శిథిలాల నుంచి ఇద్దరిని బయటకు తీయగా అప్పటికే ఊపిరాడక చనిపోయారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఇతర హమాలీలు డిమాండ్ చేయగా ఆదుకుంటామని యాజమాన్యం హామీ ఇచ్చినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ వీరబాబు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com