CM Revanth Reddy : పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటమే మొదటి ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటమే మొదటి ప్రాధాన్యత: సీఎం రేవంత్ రెడ్డి
X

పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటమే తమ ప్రభుత్వం ఎంచుకున్న మొదటి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకొని పని చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు.

సచివాలయంలో మంగళవారం జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాద్యక్షుడు చిన్నారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సదస్సును ప్రారంభించగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభోపన్యాసం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లా కలెక్టర్లతో ఇది రెండో సమావేశమని, ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని సీఎం గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి వారధులు.. సారధులు మీరేనని అన్నారు. ఇటీవలే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమర్థులైన యువ కలెక్టర్లను నియమించామని, రాజకీయ ఒత్తిళ్లు, ఎలాంటి రాగద్వేషాలు లేకుండా కలెక్టర్ల బదిలీలు చేపట్టామన్నారు.

Tags

Next Story