Amit Shah : కష్టపడితే 15 గెలుస్తాం.. నేతలకు అమిత్ షా పిలుపు

రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలకు 17 చోట్ల విజయం సాధించాలన్న లక్ష్యంతో పనిచేయాలని బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గాల కన్వీనర్లు, ఇన్చార్జిలు, పొలిటికల్ ఇన్చార్జిలకు ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితులపై నిర్వహించిన సర్వేల్లో రాష్ట్రంలోని 12 ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, ఇంకా కష్టపడితే 15 స్థానాలను సులువుగా గెలుచుకోవచ్చని నేతలకు వివరించినట్లు తెలిసింది.
రానున్నవి లోక్సభ ఎన్నికలని... నేతలు సమన్వయంతో, పరస్పర సహకారంతో పనిచేయాలని అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా కీలక నేతల మధ్య విభేదాలు తలెత్తితే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. అభ్యర్థుల బలబలాలు, ప్రజల్లో అభిమానం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అన్నింటినీ బేరేజీ వేశాకే అభ్యర్థులను ఖరారు చేస్తున్నామన్నారు.
టికెట్ రానివారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, పార్టీలో, ప్రభుత్వంలో వారికి సముచిత పదవులతో గౌరవిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఖరారు విషయాన్ని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ చూసుకుంటుందని, ఎవరికి టికెట్ వచ్చినా నేతలంతా కలిసికట్టుగా అభ్యర్థి విజయం కోసం పాటుపడాలని స్పష్టం చేసినట్టు తెలిసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com