TG : ఇప్పట్లో ఇండియాకు రాను : ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన దర్యాప్తు బృందం వారిని విచారిస్తున్నది. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐబీ(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూన్ 23న జూబ్లీహిల్స్ పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని ఆయన అందులో పేర్కొన్నారు. జూన్ 26న తాను భారత్‌కు రావాల్సిందని.. ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. అమెరికా డాక్టర్ల సూచనతో అక్కడే ట్రీట్ మెంట్ తీసుకున్నట్లు ప్రభాకర్‌రావు తెలిపారు.
టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇస్తా..
తనకు గతంలో ఉన్న మలిగ్నెంట్ క్యాన్సర్ తో పాటు ప్రస్తుతం బీపీ కూడా పెరిగిందని.. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారని ప్రభాకర్ రావు లేఖలో పేర్కొన్నారు. ‘ నేను, నా కుటుంబం మానసికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఓ పోలీసు అధికారిగా ఎలాంటి తప్పు చేయలేదు. చట్టపరంగా విచారణ జరిపించాలని కోరుతున్నాను. దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తా.
టెలీకాన్ఫరెన్స్‌లో, మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడానికైనా సిద్ధం. క్రమశిక్షణ గల అధికారిని.. విచారణ ఎదుర్కొంటా. ఎక్కడికీ తప్పించుకుని పారిపోను. పూర్తిగా కోలుకున్నాక మీ ముందు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తాను. నా దృష్టికి వచ్చిన సమాచారాన్ని విచారణాధికారికి చెబుతాను’ అని ప్రభాకర్‌రావు లేఖలో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు పోలీసులకు రాసిన లేఖ బయటకు రావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత హాట్ టాపిక్ గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com