Rajasthan : రాజస్థాన్‌లో భారీ వర్షాలకు పొంగిపొర్లిన సుర్వాల్ డ్యామ్.. 2కి.మీ. మేర గొయ్యి..

రాజస్థాన్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి. దీని ప్రభావంతో సవాయ్ మాధోపూర్ జిల్లాలో విధ్వంసం చోటుచేసుకుంది. సుర్వాల్ జలాశయం పొంగిపొర్లడంతో సమీపంలోని పొలాల గుండా ప్రవహించిన వరదనీరు జదవత గ్రామాన్ని ముంచెత్తింది. ఈ నీటి ప్రవాహానికి సుమారు 2 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పు, 55 అడుగుల లోతు గల భారీ గొయ్యి ఏర్పడింది.
ఈ భారీ గొయ్యి కారణంగా గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహానికి రెండు ఇళ్లు, పలు దుకాణాలు, రెండు దేవాలయాలు కూలిపోయాయి. అధికారులు, పోలీసులు, భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ వరదల కారణంగా ప్రభావితమైన సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే కరోడి లాల్ మీనా తెలిపారు. భారీ గొయ్యిలోకి చేరిన నీటిని మళ్లించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేల కోతను ఆపడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు.
ముమ్మరంగా సహాయక చర్యలు..
సవాయ్ మాధోపూర్‌తో పాటు రాష్ట్రంలోని పలు గ్రామాలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి. నిమోడా అనే గ్రామంలో దాదాపు 400 ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిని సహాయక శిబిరాలకు తరలించి, అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైన్యం, జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ దళాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. రాబోయే రోజుల్లో వర్షాలు కొనసాగితే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com