Britain : బ్రిటన్ దొరసానికి క్యాన్సర్.. బాధతో చెప్పిన మిడిల్‌టన్

Britain : బ్రిటన్ దొరసానికి క్యాన్సర్.. బాధతో చెప్పిన మిడిల్‌టన్

బ్రిటన్ (Britain) రాజకుటుంబ అభిమానులకు షాకింగ్ న్యూస్ తగిలింది. బ్రిటన్‌ రాజు చార్లెస్‌ పెద్ద కోడలు, ప్రిన్స్‌ విలియమ్ సతీమణి సంచలన ప్రకటన చేశారు. ప్రజలకు ముందుకు వచ్చిన యువరాణి కేట్‌ మిడిల్టన్‌.. తాను క్యాన్సర్‌ సమస్యతో పోరాడుతున్నట్లు వెల్లడించారు. 42 ఏళ్ల కేట్‌ మిడిల్టన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు స్వయంగా వీడియో చేసి దాన్ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

పొత్తికడుపు సర్జరీ తర్వాత తాను టెస్టులు చేయించుకున్నట్లు బ్రిటన్ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ వీడియోలో మాట్లాడుతూ చెప్పారు. ఆ పరీక్షల్లో తనకు క్యాన్సర్ సోకినట్లు తెలిపారు. కీమోథోరపీ చేయించుకోవాలని వైద్యులు సలహాఇచ్చారనీ.. ప్రస్తుతం చికిత్స ప్రారంభ దశలోనే ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం తమ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు కేట్.

ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు కేట్ చెప్పారు. భర్త విలియమ్‌ సహకారంతో చేయాల్సిందంతా చేస్తామని అన్నారు. ఈ సమయంలో తమ కుటుంబం ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని అనుకుంటున్నట్లు కేట్ వీడియోలో తెలిపారు. ఇంతకుముందే బ్రిటన్ రాజు చార్లెస్‌ (75) కూడా క్యాన్సర్‌ బారిన పడ్డారు. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్‌హమ్ ప్యాలెస్ తెలిపింది. ఆయన చికిత్స తీసుకుంటున్న క్రమంలోనే యువరాణి కేట్‌ కూడా క్యాన్సర్ బారిన పడటం బ్రిటన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. విలియమ్‌, కేట్‌ వివాహం 2011లో జరిగింది. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. కేట్‌ మిడిల్టన్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు సందేశాలు పంపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story