Crude Oil : 1991 తర్వాత అతిపెద్ద పతనం.. ఆకాశం నుంచి నేలకు దిగివచ్చిన క్రూడాయిల్ రేట్లు.

Crude Oil : 1991 తర్వాత అతిపెద్ద పతనం.. ఆకాశం నుంచి నేలకు దిగివచ్చిన క్రూడాయిల్ రేట్లు.
X

Crude Oil : అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఆకస్మిక యుద్ధ విరామం ప్రపంచ మార్కెట్ల ముఖచిత్రాన్నే మార్చేసింది. నిన్న మొన్నటి దాకా ఆకాశాన్నంటిన ముడి చమురు ధరలు, ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. 1991 నాటి గల్ఫ్ యుద్ధం తర్వాత చమురు ధరల్లో ఇంతటి భారీ పతనం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల శాంతి ఒప్పందం అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఒకరోజు క్రితం 117 డాలర్ల వద్ద ఉన్న డబ్ల్యూటీఐ క్రూడ్ ధర ఏకంగా 15 శాతం తగ్గి 91 డాలర్ల వద్దకు చేరింది. అటు బ్రెంట్ క్రూడ్ కూడా 13 శాతానికి పైగా తగ్గి 92 డాలర్ల దిగువకు పడిపోయింది. యుద్ధ మేఘాలు తొలగిపోవడంతో సరఫరా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. గత మూడు దశాబ్దాలలో ముడి చమురు ఇంత వేగంగా పడిపోవడం మళ్ళీ ఇప్పుడే చూస్తున్నామని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తెరుచుకున్న హోర్ముజ్ జలసంధి

ఈ భారీ పతనానికి ప్రధాన కారణం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షరతును ఇరాన్ అంగీకరించడమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక జీవనాడి వంటిది. ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు రవాణాలో 20 శాతం, ఎల్ఎన్జీ గ్యాస్ రవాణాలో 25 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. మన దేశం (భారత్) దిగుమతి చేసుకునే చమురులో సగం భాగం ఈ మార్గంపైన ఆధారపడి ఉంది. ఈ దారి తెరుచుకోవడంతో పాటు ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాలు రోజుకు 2.06 లక్షల బారెళ్ల అదనపు ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించడం సరఫరా కష్టాలను దూరం చేసింది.

ప్రస్తుత సానుకూల పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ముడి చమురు ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ కమోడిటీ నిపుణుడు అనుజ గుప్త విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బారెల్‌కు 70 నుంచి 80 డాలర్ల స్థాయికి దిగివచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా ధరలు పెరగడానికి కారణం డిమాండ్ ఎక్కువ ఉండటం కాదు, కేవలం యుద్ధం వల్ల ఏర్పడిన రవాణా అడ్డంకులే. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోవడంతో ధరలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

చమురు ధరలు తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు ఒక వరమని చెప్పవచ్చు. చమురు దిగుమతులపై ఆధారపడే మన దేశంలో.. రవాణా, ప్యాకేజింగ్ మరియు తయారీ రంగాల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. దీనివల్ల బ్యాంకింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ గూడ్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నా, దేశీయ ఇన్వెస్టర్ల అండతో భారత మార్కెట్లు నిలకడగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గి, చమురు సరఫరా మెరుగుపడితే సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరిగి దేశ ఆర్థిక వృద్ధి మరింత ఊపందుకుంటుంది.

Tags

Next Story