Ditva Cyclone: శ్రీలంకలో దిత్వా బీభత్సం

దిత్వా తుఫాన్ శ్రీలంకను కుదిపేస్తున్నది. ఇళ్లు కూలిపోవడం, పట్టణాలు జలమయమవడం, కొండచరియలు విరిగిపడటంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల రోడ్లు కొట్టుకుపోవడంతో జనజీవనం స్తంభించింది. శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం ఆదివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 334 మంది మరణించగా, 370 మంది ఆచూకీ గల్లంతయింది. దేశవ్యాప్తంగా సహాయక చర్యల్లో సైన్యాన్ని కూడా రంగంలోకి దించారు. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. 2016లో సంభవించిన వరదల కన్నా ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ సంక్షోభ సమయంలో భారత దేశం ‘ఆపరేషన్ సాగర్ బంధు’ పేరుతో సహాయపడుతున్నది. జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), భారత వాయు సేన ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. భారత ప్రభుత్వం శ్రీలంకకు 21 టన్నుల మానవతా సాయాన్ని అందజేసింది. విశాఖపట్నం నుంచి బయల్దేరిన ఐఎన్‌ఎస్ సుకన్య త్వరలోనే మరింత మానవతాసాయాన్ని అందించబోతున్నది. కాగా, దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తుఫాన్ కారణంగా తమిళనాడులో ముగ్గురు మృతిచెందారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

