Earthquake : అమెరికాలో భూకంపం.. న్యూయార్క్‌లో భయాందోళన

భూకంపం వార్త అమెరికా వాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అమెరికాలోని (America) న్యూయార్క్‌లో (New York) భూప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం ఉదయం భూకంపాలతో స్థానిక ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. న్యూయార్క్ నగరమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో ప్రకంపనల తీవ్రత కనిపించింది.
సాధారణంగా ఈ ప్రాంతంలో అత్యంత అరుదుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. న్యూయార్క్‌లో పెద్దగా భూకంపాలు వచ్చిన దఖలాలు లేవు. కానీ శుక్రవారం వచ్చిన భూకంపంతో కోట్ల మంది ప్రజలు భయపడిపోయారు. దీనిపై ముందుగా అధికారుల నుంచి కూడా ఎలాంటి హెచ్చరికలు.. అంచనాలు లేవు. ఒకేసారి భూకంపం రావడంతో 4.2 కోట్ల మంది కలవరపాటుకు గురయ్యారు. అమెరికా టైం ప్రకారం శుక్రవారం ఉదయం 10.23 గంటలకు 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా భూభౌతిక పరిశోధన సంస్థ వెల్లడించింది.
భూకంప కేంద్రాన్ని అధికారులు న్యూజెర్సీలోని వైట్ హౌస్ స్టేషన్‌కు దగ్గర గుర్తించారు. భూకంప ప్రభావంతో స్థానిక అధికారులంతా అప్రమత్తం అయ్యారు. అత్యంత రద్దీగా ఉండే ఆమ్ ట్రాక్ రైల్వే వ్యవస్థ రైళ్ల వేగాన్ని తగ్గించింది. వంతెనలు, ఇతర ప్రధాన మౌలిక వసతులను తనిఖీ చేశారు. బ్రూక్లిన్‌లతో పాటు బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, కనెక్టికట్, తూర్పు కోస్తాలోని ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనల తీవ్రత కనిపించింది. యూఎన్ఓ భద్రతా మండలి సమావేశం కూడా భూకంపం వార్తలతో లేట్ గా ప్రారంభమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com