ELININO: ఏడేళ్ల తర్వాత..ఎల్‌నినో

ELININO: ఏడేళ్ల తర్వాత..ఎల్‌నినో
ఎల్‌ నినో కారణంగా భారత్‌లో ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు తీవ్ర విఘాతం కలుగుతుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏడేళ్ల తర్వాత మళ్లీ ఎల్‌నినో ఏర్పడింది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడినట్లు అంతర్జాతీయ వాతవరణ శాఖ తెలిపింది.2016లో బలమైన ఎల్‌నినో ఏర్పడింది. ఎల్‌నినో ఏర్పడిన తర్వాతి సంవత్సరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అందువల్ల వచ్చే ఏడాది ఎండలు మరింత తీవ్రంగా ఉండి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.మరోవైపు జూలైలో ఎల్‌ నినో వస్తుందని అమెరికా వాతావరణ సంస్థతోపాటు ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తూ వచ్చాయి. అయితే ఎల్‌ నినో ఏర్పడిందని ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించింది.ఈ ఏడాది సెప్టంబర్‌ నుంచి దీని తీవ్రత పెరగనుంది. దీంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై, సముద్రంలో విపరీతమైన వేడి ఉత్పన్నమవుతుందని హెచ్చరించింది. ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఎల్‌ నినో వస్తుంది. గతంలో సంభవించిన ఎల్‌ నినోల చరిత్ర పరిశీలిస్తే దాని తీవ్రత తొమ్మిది నుంచి 12 నెలలు ఉంటుంది. మధ్య, తూర్పు పసిఫిక్‌ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు వేడెక్కడంతో ఏర్పడే వాతావరణాన్ని ఎల్‌ నినోగా నిపుణులు చెపుతున్నారు.

మరోవైపు ఎల్‌ నినో వల్ల ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా దక్షిణాసియా,ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాల్లో తీవ్రమైన కరువు ఛాయలు ఏర్పడతాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. అందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించింది.ఎల్‌ నినో కారణంగా భారత్‌లో ఖరీఫ్‌ సీజన్‌లో పంటలకు తీవ్ర విఘాతం కలుగుతుందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నైరుతి సీజన్‌ ప్రారంభం నెల జూన్‌లో తీవ్రమైన ఎండలు,వర్షాభావ పరస్థితులు భారత్‌లో తీవ్ర ప్రభావం చూపిందని,ఖరీఫ్‌ పనులపై ప్రభావం పడిందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు.

ఇక ప్రస్తుతం కేరళ, దక్షిణ కర్ణాటకకు దగ్గర్లో ఉన్న పశ్చిమ కనుమల్లో వర్షాలు కురుస్తున్నా కృష్ణా, గోదావరి బేసిన్‌లలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు పడినా.. సెప్టెంబరులో మాత్రం వర్షాభావం నెలకొంటుందని అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలపై ఎల్‌ నినో ప్రభావం కనిపిస్తోందని, దీంతో వర్షాకాలం మొదలైనా ఎండల తీవ్రత కొనసాగుతుందని చెప్పారు. వర్షాలు అన్ని ప్రాంతాల్లో కురవడం లేదని, ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుంటే, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయని నిపుణులు అంటున్నారు.ముఖ్యమంగా దక్షిణ, మధ్య, తూర్పు భారతంలో అనేక ప్రాంతాలు వర్షాభావం నెలకొందని, రిజర్వాయర్లలో నిల్వలు ఆందోళనకర స్థాయిల్లో ఉండడంతో ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story