Elon Musk : మరోసారి సంపన్నుడి హోదాను కోల్పోయిన మస్క్

టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి హోదాను కోల్పోయారు. ఆయన స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్ గా అవతరించారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ నివేదిక ప్రకారం.. టెస్లా కంపెనీ షేర్ల విలువ ఏకంగా 7.2 శాతం క్షీణించడంతో మస్క్ సంపద విలువ 197.7 బిలియన్ డాలర్లకు తగ్గింది. దీంతో 200.3 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ప్రపంచ సంపన్నుల జాబితా టాప్ ప్లేస్‌లోకి చేరాడు. గత 9 నెలల వ్యవధిలో ప్రపంచ సంపన్నుల జాబితాలో మస్క్ రెండో స్థానానికి పడిపోవడం ఇదే తొలిసారి.
ఇక జెఫ్ బెజోస్ 2021 తర్వాత ప్రపంచ నంబర్ 1 స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. 2017లో ఆయన తొలిసారి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను అధిగమించి నంబర్ 1 స్థానంలో నిలిచారు. అయితే 2021లో టెస్లా షేర్లు క్రమంగా బలపడటంతో మస్క్ సంపద అమాంతం పెరిగిపోయింది. దీంతో బెజోస్ వెనుకబడ్డారు. తిరిగి మళ్లీ ఇప్పుడే అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. మరోవైపు ఫ్రాన్స్‌కు చెందిన లగ్జరీ వస్తువుల ఉత్పత్తి లూయిస్ విట్టాన్ కంపెనీ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 197.5 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com