South Korea: దక్షిణ కొరియాలో వరద భీభత్సం..26 మంది మృతి

South Korea: దక్షిణ కొరియాలో వరద భీభత్సం..26 మంది మృతి
X
గంగ్‌ప్యోంగ్‌ సొరంగంలోకి వరద నీరు ప్రవేశించడతో 12 కార్లు, ఒక బస్సు సహా 15 వాహనాలు చిక్కుకుపోయాయి.

దక్షిణ కొరియాను భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. చెంగ్జూలోని నాలుగు లైన్ల రహదారి కింద ఉన్న గంగ్‌ప్యోంగ్‌ సొరంగంలోకి వరద నీరు ప్రవేశించడతో 12 కార్లు, ఒక బస్సు సహా 15 వాహనాలు చిక్కుకుపోయాయి. ఇప్పటికే సొరంగంలో బస్సు నుంచి ఏడు మృతదేహాలను వెలికితీశారు. దీంతో 400 మంది సహాయ బృందాలను ఇక్కడ మోహరించారు. ఈ సొరంగం పొడవు సుమారు 685 మీటర్లు ఉంది. దీనిలోకి పూర్తిగా వరద చేరడంతో చిక్కుకొన్నవారి వద్దకు వెళ్లడం అధికారులకు కష్టంగా మారింది.

చెంగ్జూలో భారీ వర్షాలు పడటంతో సమీపంలోని మిహోవ్‌ నది కట్టలు తెంచుకుని నగరంలోకి ప్రవేశించింది. వరద వేగంగా సొరంగంలోకి చేరడంతో వాహనాల్లో ఉన్నవారు తప్పించుకొనే అవకాశం కూడా లభించలేదు. ఇప్పటి వరకు 10 మంది ఆచూకీ గల్లంతైనట్లు అధికారులు చెప్పారు. భారీ పంపులను తీసుకొచ్చి సొరంగంలో నీటిని బయటకు తోడుతున్నారు.

దక్షిణ కొరియాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 26 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క ఉత్తర జియోంగ్‌సాంగ్‌ ప్రావిన్స్‌లోనే 16 మరణాలు సంభవించాయి. వేల సంఖ్యలో ఇళ్లు నీటమునిగాయి. ఇక రాజధాని సియోల్‌లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదంది. ఇక్కడ తొమ్మది మంది మరణిచారు. మరిన్ని రోజులు భారీ వర్షాలు కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story